మద్దిలేటి నరసింహ స్వామి
కర్నూలు జిల్లాలోని RS రంగాపురంలోని మద్దిలేరుకు మూడు కి.మీ దూరంలోని మోక్ష పట్టణాన్ని కన్నప్పదొర అనే రాజు పరిపాలిస్తుండేవారు. ఆయన ప్రతి శనివారం వేటకు వెళ్లేవారు. ఓరోజు వేట నుంచి తిరిగి వస్తుండగా తళతళ మెరుస్తూ ఉడుము కనిపించగా దాన్ని పట్టుకోవాలంటూ తన పరివారాన్ని ఆజ్ఞాపిస్తారు.
అది పుట్టలోకి ప్రవేశించడంతో దాన్ని పట్టుకోలేక భటులు వెనక్కి వస్తారు. అదేరోజు రాత్రి స్వామివారు రాజుకు స్వప్నంలో కనబడి పగటిపూట ఉడుము రూపంలో కనిపించింది తానేనని.. అర్చక వేదపండితులతో వచ్చి పూజలు నిర్వహిస్తే పదేళ్ల బాలుడి రూపంలో వెలుస్తానని సెలవిస్తారు. అలా రాజు పూజలు చేయడంతో స్వామి ప్రత్యక్షమై భక్తుల కోర్కెలు తీర్చేందుకు వెలిశానని చెప్పి అదృశ్యం అవుతారు. అలా మద్దులేరు పక్కన కొలువై ఉండటంతో మద్దులేటి స్వామిగా, మద్దిలేటి నరసింహ స్వామిగా నిత్యపూజలు అందుకుంటున్నారు.బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి 6 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది. ప్రతి శుక్ర, శనివారాల్లో జరిగే పూజలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. భక్తులు తాము అనుకున్న కోర్కెలు నెరవేరగానే బంధుమిత్ర సమేతంగా క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. జిల్లాలో స్వామివారి పేరుతో మద్దయ్య, మధు, మధుకిరణ్, మద్దిలేటి, మద్దిలేటమ్మ, మద్దమ్మ, మంజుల, మధనేశ్వరి, మయూరి ఇలా రకరకాలుగా పేర్లు పెటుకొని తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు.
ఉత్సవాలు
------------
ఈ క్షేత్రంలో 2008 నుంచి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం అశేషభక్తుల మధ్య జరుగుతుంది. మూడురోజులపాటు పలు ఉత్సవాలు, క్రీడలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత.
ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నది. దాతల సహకారంతో నిర్మించిన 150 గదులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎలా వెళ్లాలి...?
------------
కర్నూలుకు 65 కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంది. బేతంచెర్ల, డోన్ నుంచి ఆర్ఎస్ రంగాపురం వరకు బస్సు, రైలు సౌకర్యం ఉంది. నంద్యాల, డోన్ రైలు మార్గంలో రంగాపురం స్టేషన్లో దిగి ఆలయానికి చేరుకోవచ్చు.